మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం
ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆశీస్సులు అందించిన మహిళా శక్తికి కృతజ్ఞతలు అని అన్నారు.
మిస్ పర్ఫెక్ట్ గా మారిన మెగా కోడలు..
హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది మెగా కోడలిగా మారిన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా.. ? లేదా.. ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పెళ్లి తరువాత మొట్ట మొదటి ప్రాజెక్ట్ ను లావణ్య ప్రకటించింది. మిస్ పర్ఫెక్ట్ గా మెగా కోడలు మారిపోయింది. గతేడాది అతిథి, దయా, వధువు వంటి ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు అందించిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్..కొత్త ఏడాదిలో మిస్ పర్ఫెక్ట్ అనే మరో సరికొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రతి పని పర్ఫెక్ట్ గాచేసే మిస్టర్ పర్పెక్ట్ ల గురించి మాట్లాడుకుంటుంటాం…కానీ ఇక్కడ మిస్ పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసింది, చేయించింది అనేది ఈ వెబ్ సిరీస్ లో హిలేరియస్ గా చూపించబోతున్నారు దర్శకుడు విశ్వక్ ఖండేరావ్.
తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ
ఊహించిన విధంగానే తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో దఫా భారీ ఐఏఎస్‌ల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది.తాజా ఉత్తర్వుల్లో 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.శాసనసభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం స్థిరపడి, ఏకకాలంలో 2024లో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఈ బదిలీలు కీలకమైనవి.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను బదిలీ చేయడంతోపాటు రాష్ట్రంలోని 26 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బుధవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్మితా సబర్వాల్ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేయబడి పోస్ట్ చేయబడింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ క్యాదర్శిగా రాహుల్ బొజ్జా బదిలీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ బాధ్యతలను డీ దివ్యకు అప్పగించింది. నల్గొండ కలెక్టర్‌గా హరిచందన దాసరిని బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న భారతీ హొళికెరికి ఆర్కియాలజీ బాధ్యతలను అప్పగించింది. రంగారెడ్డి కలెక్టర్‌గా కే శశాంక, మహబూబాబాద్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్‌ను బదిలీ చేసింది. టీఎస్ డైరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఫెడరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి, కార్మికశాఖ డైరెక్టర్‌గా క్రిష్ణ ఆదిత్య, మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖానమ్‌ను నియమించింది.
సీఎంవో కార్యాలయ జాయింట్ సెక్రెటరీగా సంగీత సత్యనారాయణ, సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరి క్రాంతి, జోగులాంబ కలెక్టర్‌గా బీఎం సంతోష్, హైదరాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా కధీరవన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బీ వెంకటేశం, పీసీబీ సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధా ప్రకాశ్, ఆయూష్ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతి, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ముఖ్య కార్యదర్శిగా డీ కృష్ణ భాస్కర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ఆర్వీ కర్ణన్, జీఏడీ కార్యదర్శిగా రఘునందన్‌రావు, పంచాయతీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రైవర్ స్థాయి గురించి ప్రశ్నించినందుకు!.. కలెక్టర్‌పై బదిలీ వేటు
హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు. షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యల్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి భాషను సహించబోమని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. కన్యల్‌ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. బదిలీ తర్వాత, నార్సింగ్‌పూర్ కలెక్టర్ రిజు బఫ్నా షాజాపూర్ కొత్త కలెక్టర్‌గా నియమితులయ్యారు.
కాంగ్రెస్ మంత్రుల్లో అహంభావం కన్పిస్తోంది
కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే…. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కన్పిస్తోందని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ పై విధంగా స్పందించారు. ‘‘ఎవరికి ఎవరు కోవర్టో, ఏ పార్టీ నేతలు.. ఇతర పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసు…‘‘అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు అద్రుష్టం ఉన్నందునే అధికారంలోకి వచ్చారే తప్ప ఆ పార్టీ నేతలు చేసిన పోరాటాలేమీ లేవని అన్నారు. ‘‘అసలు మీరు ఎవరి కోసం కొట్లాడారు? ఏనాడైనా నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళల పక్షాన ఉద్యమాలు చేశారా?’’అని ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లోని బోయినిపల్లి అనురాధ టింబర్ డిపోను సందర్శించారు.
అరగంట పాటు జగన్, భారతితో షర్మిల మాటామంతి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు. సరిగ్గా అరగంట పాటు షర్మిల, జగన్ కుటుంబాలు సమావేశం అయ్యాయి. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందజేశారు. అనంతరం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు. అక్కడ విశ్రాంతి తీసుకుని.. రాత్రి 8.50 నిమిషాలకు ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.
పార్టీలో కేశినేని చిన్ని ఎవరు?.. ఎంపీనా, ఎమ్మెల్యేనా ?
తిరువూరులో టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జరిగిన వివాదంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కేశినేని చిన్ని ఎవరు ?.. చిన్ని ఎంపీనా, ఎమ్మెల్యేనా ? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సభలకు దూరంగా ఉంటున్నానని ఎంపీ తెలిపారు. అందుకే తాను యువగళంకి వెళ్ళలేదని ఆయన చెప్పారు. చంద్రబాబును పట్టించుకోలేదు అంటున్నారని.. కానీ చాలా వరకు ఓపికగా ఉంటున్నానని కేశినేని నాని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబు కోసం, పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసమే అలా ఓపికగా ఉంటున్నానని ఎంపీ స్పష్టం చేశారు. ఎన్నో అవమానాలు కూడా పడుతున్నానన్నారు.
ఖాసిం సులేమానీ సమాధి దగ్గర రెండు భారీ పేలుళ్లు.. 103 మంది మృతి !
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు గురై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సమాధి సమీపంలో జరిగిన రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లలో కనీసం 103 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు ఖాసీం సులేమానీ సుప్రీం కమాండర్‌గా వ్యవహరించారు. 2020 జనవరి 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మరణించారు. కెర్మాన్ నగరంలోని ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో జరిగిన ఊరేగింపులో రెండు బాంబు పేలుళ్లు జరగగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ఇరిబ్ తెలిపారు. పేలుళ్లు సంభవించడంతో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ చేసిన జగన్ కామెంట్లపై చంద్రబాబు కౌంటర్
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్సులో తిరుగుతున్నారన్నారు. తన తల్లీ – చెల్లీ వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధమని ఆయన పేర్కొన్నారు. ఏదో రకంగా ఇతరులపై బురద చల్లేసి బతకటమూ ఓ రాజకీయమా అంటూ ఎద్దేవా చేశారు. ఫించన్ల పెంపు అంటూ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి, రాజకీయ పార్టీలను విమర్శిస్తాడా అంటూ మండిపడ్డారు.