రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది సీఎం తీరు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతామని అంటున్నారని విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
నెలకు 9 లక్షలు జీతం.. పైరసీ రాయుళ్ల కలెక్షన్ మాములుగా లేదుగా
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ పైరసీ రాయుళ్ల విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల పైరసీపై లోతైన దర్యాప్తు చేసి దేశంలోనే తొలిసారిగా ఒక పైరసీ ముఠాను పట్టుకున్నామని తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతోందని సీపీ వివరించారు. 2023లో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు రూ.22,400 కోట్లు, 2024లో తెలుగు పరిశ్రమకు రూ.3,700 కోట్లు పైరసీ వల్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పైరసీ సినిమాల వల్ల ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు కూడా అలవాటు పడుతున్నారని ఆయన చెప్పారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నారని, పైరసీ మూవీల ద్వారా తమ యాప్‌లను ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.
చిరంజీవి నా ఆదర్శం.. ఆయన వల్లే ఈ స్థాయికి వచ్చా: ప్రభుదేవా
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే భాషతో సంబంధం లేకుండా తన డ్యాన్స్ యాక్టింగ్ తో స్పెషల్ ఇయెజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్‌షోలో అతిథిగా హాజరైన ఆయన తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘హిప్‌హాప్, బ్రేక్ డ్యాన్స్ ఇవేవి నాకు తెలియదు. నాకు తెలిసిందల నా స్టైల్ డ్యాన్స్ మాత్రమే. అదే ప్రేక్షకులకు అందిస్తున్నా. మా వంశంలో చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు. కానీ నా కొడుకు రిషి మొదట ఈ రంగంలో ఆసక్తి చూపలేదు. కానీ రెండు సంవత్సరాల క్రితం సడన్‌గా ‘నేను యాక్టర్ అవుతాను’ అన్నాడు. అప్పటి వరకు పిల్లాడిలా ఉండే అతను ఇలా చెప్పడంతో షాక్ అయ్యాను. ఈ రంగంలో నిలబడటం కష్టం. కాబట్టి ముందుగా చదువు పూర్తి చేయమని చెప్పా. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం పొందమని సలహా ఇచ్చాను’ అని తెలిపారు.
కరూర్ తొక్కిసలాట ఘటన.. బయటకు వస్తున్న సంచలన విషయాలు!
తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రచార సభ సమయంలో టీవీకే పార్టీనే పవర్ కట్ చేయమందని తమిళనాడు విద్యుత్తు బోర్డు అంటోంది. తమ పార్టీ అధినేత విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకే వినతిపత్రం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమకు లేఖ ఇచ్చినట్లుగా విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని తమకు టీవీకే పార్టీ నేతలు లేఖ ఇచ్చినట్లు విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. విద్యుత్ నిలిపివేయడంపై తమకేం సంబంధం లేదని, విద్యుత్తు బోర్డు అధికారులు కావాలనే సరఫరా నిలిపివేశారని టీవీకే ఆరోపణలు చేస్తోంది. కరూర్‌లో విజయ్ ప్రచార సభలో పవర్ కట్ జరగడంతోనే తొక్కిసలాట జరిగినట్లు టీవీకే ఆరోపణలు చేస్తోంది. మరి ఇందులో ఎవరి చెప్పేది నిజమో తెలియక విజయ్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
ట్రోఫీ త్వరగా తిరిగి ఇవ్వండి.. మొహ్సిన్ నఖ్వీకి BCCI అల్టిమేటం..
ఆసియా కప్ 2025 ఫైనల్ (IND vs PAK ఫైనల్)లో టీం ఇండియా పాకిస్థాన్ ను చిత్తు చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక మైదానంలో హైడ్రామా చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు భారత్ ప్లేయర్స్ నిరాకరించారు. దీంతో ట్రోఫీ పతకాలను స్వీకరించడానికి నిరాకరించిన తర్వాత, ACC అధ్యక్షుడు, PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తనతో పాటు ట్రోఫీ, పతకాలను తీసుకెళ్లారని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై వచ్చే నెలలో జరిగే ఐసిసి సమావేశంలో బిసిసిఐ అధికారికంగా ఫిర్యాదు చేస్తుందని సైకియా చెప్పారు. వీలైనంత త్వరగా ట్రోఫీని తిరిగి ఇవ్వాలని మొహ్సిన్ నఖ్వీకి అల్టిమేటం కూడా జారీ చేశారు.
రిషబ్ శెట్టిపై తెలుగు యువత ఆగ్రహం.. ఇంత చిన్న చూపా..?
కన్నడ హీరో రిషబ్ శెట్టి మీద తెలుగు యువత తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రిషబ్ శెట్టి నటించిన కాంతార-1 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అందరినీ షాక్ కు గురి చేశాడు. తెలుగు నేల మీదకు వచ్చి కన్నడ భాషలో మాట్లాడాడు. ఒక్కటంటే ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేదు. ఆయనకు తెలుగు రాదా అంటే మాట్లాడాలి అనుకుంటే కనీసం రెండు ముక్కలైనా మాట్లాడేవాడు కదా. హిందీ హీరో హృతిక్ రోషన్ వచ్చి తెలుగులో నాలుగు ముక్కలైనా మాట్లాడేందుకు ట్రై చేశాడు. కానీ రిషబ్ శెట్టి మాట వరసకైనా తెలుగులో ఒక్క ముక్క అనలేదు.
అనకాపల్లిలో ఉద్రిక్తత.. హోంమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతం అయింది. హోంశాఖ మంత్రితో చర్చలు విఫలం అవ్వడంతో గ్రామస్తుల ఆందోళనకు దిగారు. దీంతో హోం మంత్రి అనిత కాన్వాయ్ నీ ఆపేందుకు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నారు. మరోవైపు, బల్క్ డ్రగ్ పార్క్ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులు ఆందోళన చేయడంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజయ్య పేట పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేయకుండా ఆమె ఒప్పించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇక, పోలీసు భద్రత మధ్య సంఘటన స్థలం నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లిపోయింది.
సజ్జనార్ లాస్ట్ వర్కింగ్ డే సాధారణ ప్రయాణం.. అందరూ షాక్..!
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, పలువురు కీలక అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇప్పటివరకు పనిచేసిన వీసీ సజ్జనార్, తన పదవీకాలంలో చివరి రోజును సాధారణ ప్రజల మాదిరిగానే గడిపారు. ప్రజా రవాణాపై తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ, సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. హైదరాబాద్ లక్డీకాపుల్‌లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి 113 I/M రూట్ బస్సులో ఎక్కి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బస్ భవన్ వరకు ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా యూపీఐ ద్వారా చెల్లింపు చేసి కండక్టర్ వద్ద నుంచి టికెట్ తీసుకున్నారు. ప్రయాణంలో సహ ప్రయాణికులతో ముచ్చటిస్తూ, వారి అనుభవాలు, సమస్యలు, ఆర్టీసీ రవాణా సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
4 రోజులు 252 కోట్ల విధ్వంసం
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందించబడిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే సినిమా అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే నార్మల్ ఆడియన్స్ మాత్రం రొటీన్ సినిమానే కానీ పవన్ కళ్యాణ్‌ని కొత్తగా చూడటం బాగుందని అన్నారు. ఏదైతేనేం, ఈ సినిమా నాలుగు రోజులలో 252 కోట్ల రూపాయల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వసూలు చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద డి.వి.వి దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించాడు. వీరు కాకుండా ఈ సినిమాలో శ్రీయ రెడ్డి, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.