గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం.. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్ పోలీస్ లతో పాటు మరో 9000 మంది ఇతర జిల్లాల నుంచి బందో బస్తుకు వస్తారన్నారు.
చండీగఢ్- కుల్లు- మనాలి హైవేపై 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో.. చండీగఢ్- కుల్లు హైవే పూర్తిగా స్థంభించిపోయింది. దీని ఫలితంగా దాదాపు 50 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల వేలాది వాహనాలు రోడ్డు పైనే ఇరుక్కుపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లకు వెళ్లాల్సిన వందలాది ట్రక్కులు ఆగిపోవడంతో పండ్లు, కూరగాయల రవాణా తీవ్రంగా దెబ్బతింది.
కష్టపడి డీఎస్సీ కొట్టింది.. ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో కన్నుమూసింది..
ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని పట్టుబట్టింది.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సంపాదించి.. తన భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవడంతో పాటు.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని కలలు కనింది.. దాని కోసం ఎంతో కష్టపడి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హత సాధించింది.. అన్నీ అనుకూలిస్తే.. త్వరలోనే టీచర్‌గా పాఠాలు చెప్పాల్సిన సమయంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది ఓ యువతి..
ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాకు భారత ప్రధాని.. ఆగస్టు 31న జిన్‌పింగ్‌తో మోడీ భేటీ
ఆగస్టు 31వ తేదీన జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించబోతున్నారు. ఈ టూర్ ఇటీవలి కాలంలో, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం, భారత్- చైనా మధ్య సంబంధాలలో ఒక కీలక మలుపుగా చెప్పుకోవాలి. నేటి సాయంత్రం రెండు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్తున్న మోడీ. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు చైనా నగరమైన టియాంజిన్‌లో పర్యటిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దుబాయ్ యువరాణి మళ్లీ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఫొటోలు
దుబాయ్ యువరాణి షేకా మహ్రా మళ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతేడాది సోషల్ మీడియాలో భర్తకు విడాకులు ప్రకటించి సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా(40)తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని ర్యాపర్ అధికార ప్రతినిధి ధ్రువీకరించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీంతో దుబాయ్ యువరాణి వార్తల్లో నిలిచింది.
ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!
రష్యా ఆటగాడు, ప్రపంచ 13వ ర్యాంకర్ డేనియల్ మెద్వెదేవ్‌కు భారీ జరిమానా పడింది. యూఎస్ ఓపెన్ 2025లోని తొలి రౌండ్‌లోనే ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదెవ్ తన రాకెట్‌ను కోర్టులోనే విరగ్గొట్టాడు. అంతకుముందు ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. ఈ రెండు సంఘటనల కారణంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులు అతడికి 42,500 యూస్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.37 లక్షలు) జరిమానాను విధించారు. తొలి రౌండ్‌లో ఆడినందుకు వచ్చే 110000 డాలర్ల ప్రైజ్‌మనీలో ఈ జరిమానా మూడో వంతుకు పైగా కావడం గమనార్హం.
వరద బాధితులకు అండగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్
నర్మాల గ్రామస్తుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ప్రజలు ఎంతగానో కొనియాడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నర్మాల గ్రామంలో చిక్కుకుపోయిన ఐదుగురు గ్రామస్తులను సురక్షితంగా కాపాడటంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. వరదల్లో ప్రజలు చిక్కుకున్నారని తెలిసిన వెంటనే బండి సంజయ్ కుమార్ యుద్ధ ప్రాతిపదికన రక్షణ శాఖ మంత్రితో మాట్లాడారు. ఆయన విజ్ఞప్తి మేరకు, రక్షణ శాఖ తక్షణమే స్పందించి నాలుగు ఆర్మీ హెలికాప్టర్లను పంపింది. ఈ హెలికాప్టర్లలో రెండు, నర్మాల గ్రామంలో చిక్కుకున్న ఐదుగురిని విజయవంతంగా కాపాడాయి. మిగిలిన రెండు హెలికాప్టర్లను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పంపి, అక్కడ ముంపు బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉంచారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి కుటుంబానికీ ‘ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్’!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫామిలీ బెనిఫిట్ కార్డ్’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డ్ తరహాలోనే బెనిఫిట్ కార్డ్ ఉండనుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీంలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచనుంది. ప్రభుత్వం త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కాకతీయ వర్సిటీలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజేందర్ ప్రకటించారు. వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
వర్ష బీభత్సం.. రేపు, ఎల్లుండి స్కూల్స్ బంద్
సిద్దిపేటలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. కోమటిచెరువు నాలా ఉప్పొంగడంతో పట్టణం జగదిగ్బంధంలో చిక్కుకుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30) సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల విద్యార్థులకు రేపు, ఎల్లుండి పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి.