ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా, గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?
తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లను సంపాదించేందుకు కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు.
రేపు లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ.. అధికార- విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ..
లోక్‌సభలో రేపటి (జూలై 28న) నుంచి ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కోసం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది కేంద్రం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఈ చర్చ జరగనుంది. అయితే, ఈ చర్చను లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు.
బిజెపి పొత్తుపై అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు, గద్వాలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత గద్వాలకు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సింగపూర్లా అమరావతిని చేస్తా..
సింగపూర్ లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. తొలిరోజు భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి అని చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుపై చాలా మంది విమర్శలు గుప్పించారు. ఇక, తెలంగాణ అభివృద్ధికి నేను తెచ్చిన ఐటీ విప్లవమే కారణం అని గుర్తు చేశారు. హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించాం.. ఐటీ రంగంలో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ముందున్నారు అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రజల ఉత్సాహం ఏపీ అభివృద్ధికి దోహదం కావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లో డ్రగ్స్ తో పట్టుబడ్డ ఓల్డ్ సిటీ యువతి..
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ యువతి డ్రగ్స్ తో పట్టుబడింది. డ్రగ్స్ కేసులో కిషన్ బాగ్ కి చెందిన అమీనా బేగం అనే మహిళను అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు.. డ్రగ్స్ తో వెళుతుండగా తనిఖీలు చేసి అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు. బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం పేరుతో ట్రావెల్ ఎంజెంట్ దుబాయ్ కి పంపాడు. దుబాయ్ కి వెళుతున్న అమీనా బేగంకు బట్టల బ్యాగ్, పార్సల్ ఇచ్చాడు ఏజెంట్. బట్టల బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టి మహిళకు ఇచ్చాడు ఏజెంట్. దుబాయ్ కి చేరుకున్నాక పార్సిల్ అందజేయాలని ఏజెంట్ చెప్పాడు. దుబాయ్ కి చేరుకోగానే ఇమిగ్రేషన్ లో డ్రగ్స్ తో పట్టుబడింది మహిళ. దీంతో హైదరాబాద్ లో ఏజెంట్ పై నిఘా పెట్టారు పోలీసులు. అమీనా బేగం దుబాయ్ పోలీసుల అదుపులో ఉంది.
టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..
గతేడాది గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. ఆ సమయంలో యాహ్యా సిన్వార్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గాజాలోని టన్నెల్స్‌లో అత్యంత రహస్యంగా ఉండే సిన్వార్‌ని ఇజ్రాయిల్ బలగాలు ఎంతో ట్రాక్ చేసి, చివరకు హతమార్చింది. ఇదిలా ఉంటే, ఆయన భార్య గాజా నుంచి తప్పించుకుని, టర్కీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా నుంచి థియోలజీలో డిగ్రీ పొందిన సమర్ ముహమ్మద్ అబూ జమర్, 2011లో సిన్వార్‌ని పెళ్లి చేసుకుంది. అయితే, ఆమె నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి తన పిల్లలతో గాజా స్ట్రిప్ నుంచి పారిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. అబూ జమర్ గాజాకు చెందిన వేరే మహిళ పాస్‌పోర్టును ఉపయోగించి, రఫా సరిహద్దు దాటి ఈజిప్టులోకి వెళ్లిందని, ఆ తర్వాత టర్కీకి చేరినట్లు తెలిసింది. టర్కీలో మరో వ్యక్తిని వివాహం చేసుకుందని నివేదిక వెల్లడించింది.
సరోగసి పేరు చెప్పి.. చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ క్లినిక్‌పై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు స్పష్టంచేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. సృష్టి క్లినిక్‌లో సరోగసి పద్ధతిలో బిడ్డను కల్పిస్తామని చెబుతూ, వాస్తవానికి వేరే మహిళకు పుట్టిన బిడ్డను ఇవ్వడం ద్వారా దంపతులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణి మహిళను ఫ్లైట్‌లో విశాఖపట్నానికి తీసుకొచ్చి, అక్కడ డెలివరీ చేయించారని రష్మి పెరుమాళ్ తెలిపారు. పుట్టిన బిడ్డను ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దంపతులకు సరోగసి బిడ్డ అని నమ్మించారు. సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత దంపతుల వద్ద నుండి రూ.40 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో బిడ్డను ప్రసవించిన ఢిల్లీ మహిళకు రూ.90,000 ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తం లావాదేవీలన్నీ సరోగసి సేవల పేరిట మోసపూరితంగా నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సెల్ఫీ వీడియో.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి అంశం మళ్లీ రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. “జగిత్యాల అభివృద్ధికి మీవల్ల సహకరించగలిగితే చేయండి, కానీ దయచేసి అడ్డుపడకండి” అని మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ 18 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పటికీ, అప్పటి నాయకులు దాన్ని పూర్తి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
13 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి రాజ్ ఠాక్రే..
13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు. రాజ్ ఠాక్రేతో పాటు ఎంఎన్ఎస్ నాయకులు బాలా నందగావ్‌కర్, నితిన్ సర్దేశాయ్‌లు ఉద్ధవ్ ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారు. ఇద్దరు కజిన్స్ ఇటీవల తన మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేసే నిర్ణయంపై పోరాటంలో ఈ ఇద్దరు నేతలు కలిశారు. రెండు దశాబ్ధాల కాలంలో ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. తమ పోరాటంతోనే హిందీపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విజయ ర్యాలీని నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోరాడుతాయని చెప్పారు. ఉద్ధవ్‌తో విభేదాల కారణంగా రాజ్ 2005లో శివసేన నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ ఎంఎన్ఎస్ ను స్థాపించారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నారు.
ఎఫ్ఐఆర్‌లో సంచలన వివరాలు
హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నమోదైన కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోపాలపురం పోలీసులు ఈనెల 25న ఈ కేసును నమోదు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు సోనియా తన ఫిర్యాదులో, గత సంవత్సరం ఆగస్టు నెలలో డాక్టర్ నమ్రతను సంప్రదించామని పేర్కొంది. సంతానం కోసం IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రొసీజర్ చేయించాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అయితే, ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత ₹30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.