కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా
కవిత రాజీనామాపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానంలో ఉన్న కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం లేకుండా అవి జరిగాయని అనటం అసాధ్యమని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత, వాటాలో తేడా రావడంతోనే కవిత బహిరంగ వేదికపైకి వచ్చారని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
ఏపీలో యారియా కొరతపై.. మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
ఏపీలో యూరియా కొరత, రైతుల సమస్యలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు.. కానీ రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తానే ఇవ్వలేక పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ విమర్శలు గుప్పించారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే..బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? అంటూ మండిపడ్డారు.
ఆ రోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ట్విన్ సిటీలు సహా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జనం రోజున ప్రజా రద్దీ అధికంగా ఉండటం, భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ సెలవు కారణంగా వచ్చే నెలలో రెండో శనివారం అయిన అక్టోబర్ 11న సాధారణ పనిదినంగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అంటే అక్టోబర్ 11 శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు యథావిధిగా పని చేయనున్నాయి. ఈ నిర్ణయం జంటనగరాల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వర్తించనుంది. సంబంధిత విభాగాలు, అధికారులు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
యూరియా కొరతపై.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
యూరియా కొరతపై మాజీ మంత్రి అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని తయారు చేశాడని ఆయన ఆరోపించారు. వైయస్సార్ వర్థంతి సందర్భంగా విజయమ్మను జగన్ అవమానించారంటూ విషప్రచారం చేయించారు. జగన్ వ్యక్తిత్వ హసనానికి లోకేష్ పాల్పడుతున్నాడని విమర్శించారు. లోకేష్ కు సొంత దమ్ము లేకపోయినా.. ముఖ్య మంత్రి కొడుకు కాబట్టి రాజకీయం చేస్తున్నాడు. జగన్ సొంత పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబును కలవాలంటే లోకేష్ అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. లోకేష్ శని, ఆదివారాలు ఎక్కడికి వెళ్తున్నాడో త్వరలో చెప్తానన్నారు. లోకేష్ సంస్కార హీనుడని.. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టించాడన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తులో తనకు పోటీ వస్తాడని లోకేష్ భయపడుతున్నాడు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతే లేదంటున్నారు. గ్రామాల్లో కొచ్చి చూస్తే యూరియా లేక రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవాలు తెలుస్తాయన్నారు.జగన్ పిలుపుమేరకు ఈనెల తొమ్మిదిన రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాల ముందు యూరియా కొరతపై నిరసన తెలుపుతామన్నారు అంబంటి.
పేదల ఆశయమే మా ఆత్మగౌరవం
ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు. ప్రతి అంశంలో తొలుత స్పందించే చైతన్యం ఉన్న జిల్లా ఇది అని, కమ్యూనిస్టు సోదరులు కూడా మనతో అండగా నిలిచారు అని ఆయన అన్నారు. ఈ సభలు ఎన్నికల కోసం కాదని స్పష్టం చేస్తూ, పేదల సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి వేదికలు అవశ్యకమని ఆయన పేర్కొన్నారు. “పదేళ్లుగా ఇళ్ల కోసం పేదలు ఎదురుచూశారు. స్వంత ఇంటి కలను 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెరవేర్చారు. హనుమాన్ గుడి లేని ఊరు ఉండవచ్చు, కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం మాత్రం ఉండదు” అని సీఎం వ్యాఖ్యానించారు.
విశాఖలో గోవా గవర్నర్ కు ఘన సన్మానం
విశాఖపట్నంలో గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్ గజపతి రాజుకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాను.విశాఖ లో ప్రజా ధనం తో కట్టిన ఋషి కొండ ప్యాలస్ పెచ్చులు ఉడిపోయాయి అని తెలిసింది.ఆ భవనం కోసం ఖర్చు పెట్టిన 600- 700 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అయ్యేది అనుకునే వాడిని….ఈ ప్యాలస్ ఏం చెయ్యాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది…దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని ఆయన ఉచిత సలహా ఇచ్చారు…..కనీసం దానినీ కట్టిన దుర్మార్గులు కి ఆ సముద్ర గాలి తగులుతుంది అనుకున్నాం…ఆ భవనం మీద రిటర్న్స్ రావన్నారు.
హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో హీరో రాజ్ తరుణ్‌పై మరోసారి కేసు నమోదు అయింది. కోకాపేట్‌లోని విల్లాలో నివాసం ఉంటూ తనపై దాడి జరిగిందని లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య తన ఫిర్యాదులో మూడు వేర్వేరు సందర్భాల్లో రాజ్ తరుణ్ అనుచరులు దాడులు చేసినట్లు ఆరోపించారు. 2016లో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేట్‌లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిపారు.
ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీల జాతర పెట్టిన కాంగ్రెస్, ఎన్నికల తర్వాత మాత్రం చెప్పుల జాతర మిగిల్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “ఆనాటి రోజులు తిరిగి తెస్తానని రేవంత్ నిజమే చెప్పాడు… కానీ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశాడు” అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే వెనుకబడ్డామని అంగీకరించారు.
సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదు- బొత్స
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నెలలు గడిచిన సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటూ బొత్స మండిపడ్డారు. దమ్ములు గురించి మాట్లాడటానికి ఇవి మల్ల యుద్ధాలు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి..అసెంబ్లీ లో తేల్చుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో రెండు లక్షలు కోట్లు అప్పులు తెచ్చారని.. ఈ విషయం వాస్తవం కాకపోతే.. వెంటనే బయట పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారని ఆరోపించారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని.. మళ్లీ జగన్ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు ఎప్పటికప్పుడు ఎండగడుతామని బొత్స అన్నారు.
మద్యం మత్తులో యువతితో గొడవ పడిన కానిస్టేబుల్.. అడ్డుకున్న మరో కానిస్టేబుల్…
మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతితో ఓ కానిస్టేబుల్ గొడవ పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. గొడవ అడ్డుకునేందుకు మరో కానిస్టేబుల్ ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు ఒకరి నొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ ఫోర్త్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయక్ తాగిన మైకంలో ఓ యువతితో గొడవపడ్డాడు. యూనిఫాంలో ఉండి ఫుల్ గా మద్యం సేవించాడు. అంతే కాకుండా యువతితో గొడవకు దిగాడు. శ్రీనివాస నాయక్, మహిళ మధ్య గొడవలో జోక్యం చేసుకున్నాడు విజయవాడ అజిత్ సింగ్ నగర్ బీటు కానిస్టేబుల్ కోటేశ్వరరావు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై శ్రీనివాస నాయక్ , కోటేశ్వరరావు చొక్కాలు పట్టుకుని గొడవ పడ్డారు.