Telangana weather:హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు వడగళ్లతో పాటు వర్షం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగళ్ల వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. అంతే కాకుండా.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు కూడా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు (7న) కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగళ్ల వాన కురుస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎల్లుండి (8న) ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వడగళ్ల వాన హెచ్చరికలు జారీ చేశారు.
Read also: Aaliya Nawazuddin: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నవాజుద్దీన్ భార్య.. మరో వ్యక్తితో ఎఫైర్?
ఇక 9వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 10వ తేదీన వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, నిర్మల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురుస్తుందని తెలిపారు. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం, ఖమ్మంలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పటాన్‌చెర్వులో అత్యల్పంగా 22.6 డిగ్రీలు నమోదైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.