పదవ తరగతి ప్రధాన పరీక్షలు నేటితో ముగియనున్నాయి. వొకేషనల్ విద్యార్థులు మాత్రం మరో రెండు పరీక్షలు రాయాల్సి ఉంది. వారికి జూన్1న చివరి పరీక్ష ఉంటుంది. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పరీక్షలను 6 పేపర్లకే పరిమితం చేశారు. జూన్ 2న స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించనున్నారు. జూన్ 25 లోపే ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ఈనెల 23న ప్రారంభమైన విషయం తెలిసిందే.కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటి సారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతుండటంతో.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల సందడి వాతావరణం కనిపించింది.
రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో పరీక్షలను ఏర్పాటు చేశారు అధికారులు. 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రైవేట్ కలిపి మొత్తం 5,09,275 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని అంచనావేశారు అధికారులు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి అనుమతించారు.
పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని కూడా అనుమతించారు. పరీక్షా కేంద్రాలకు గంటముందే చేరుకున్న విద్యార్థులను ఉపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలను అమలు చేశారు.
కాగా.. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత పదవతరగతి పరీక్షలు నేటితో ముగియనున్నాయి. దీంతో రెండేళ్ల తరువాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి 10వ తరగతి పరీక్షలు రాసి అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. ఏదిఏమైనా ఏడాది పరీక్షలను 6 పేపర్లకే పరిమితం చేసి ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను నేటితో చెక్ పెట్టింది. అయితే.. పదవ తరగతి పరీక్షా ఫలితాలను జూన్ 25 లోపే ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.