Sankranti Buses : సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని నిబంధనలను అతిక్రమిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పట్ల తెలంగాణ రవాణా శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. జనవరి 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను ప్రారంభించిన అధికారులు, ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 75 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను విస్మరించి బస్సుల్లో భారీగా సరుకు రవాణా చేయడం, ప్రయాణిస్తున్న వారి వివరాలతో కూడిన జాబితా నిర్వహించకపోవడం, కనీస అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులను అందుబాటులో ఉంచకపోవడం వంటి ఉల్లంఘనలపై రవాణా శాఖ ఈ చర్యలు చేపట్టింది. పండుగ సీజన్ ముగిసే వరకు ప్రైవేట్ ఆపరేటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Pakiatan: ‘‘ నెతన్యాహూను కిడ్నాప్ చేయండి’’.. ట్రంప్‌ను కోరిన పాకిస్తాన్..
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ, నిఘా పెంచేందుకు 8 ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఎక్కడా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించింది. ముఖ్యంగా పండుగ సమయంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేయడంపై రవాణా శాఖ సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి మించి ఛార్జీలు వసూలు చేయరాదని, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీలుగా మార్చి ప్రతి స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ట్రావెల్స్ అయినా అధిక వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలతో పాటు లైసెన్సుల రద్దుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.
మరోవైపు స్లీపర్ బస్సుల నిర్వహణపై కూడా రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. త్వరలోనే స్లీపర్ బస్సుల భద్రత , నిర్వహణకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణలో రాకపోకలు సాగిస్తున్న స్లీపర్ బస్సుల బాడీ బిల్డింగ్ , ఇతర సాంకేతిక నిబంధనలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ నిశ్చయించుకుంది. పండుగ వేళ ప్రజల ప్రయాణం సురక్షితంగా , సులభంగా సాగేలా చూడటంతో పాటు, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేయడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని రవాణా శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
APSRTC Rental Bus Owners Strike Call Off: ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మెకు తెర..