తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించగా.. త్వరలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను కూడా వెల్లడించే అవకాశముంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎస్సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం.
వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్లోనే జరగాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్ నుంచే అధికారులు కసరత్తు చేస్తారు. అయితే కరోనా మూలంగా పరీక్షలు లేకుండానే గతేడాది విద్యార్థులను పాస్ చేశారు. ఈసారి కూడా కోవిడ్ మూడోవేవ్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఉంటాయా? లేదా? అనే డోలాయమానంలో విద్యాశాఖ ఉంది. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మంత్రి సబిత ఆదేశిస్తే ఈరోజు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.