తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువులు, నాళాల అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారుతున్న తరుణంలో, మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి (MAUD) శాఖ వినూత్నమైన TDR (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానం ప్రకారం, నగరంలోని చెరువులు , నాళాల పరిరక్షణ కోసం తమ పట్టా భూములను వదులుకునే వారికి ప్రభుత్వం భారీ స్థాయిలో పరిహారాన్ని ఆఫర్ చేస్తోంది. చెరువుల ఎఫ్.టి.ఎల్ (FTL) పరిధిలో భూమి కోల్పోయిన వారికి 200 శాతం, బఫర్ జోన్ పరిధిలో భూమి ఇచ్చే వారికి 300 శాతం, బఫర్ జోన్ వెలుపల లేదా నాళాల వెడల్పు పెంపు కోసం భూమి అప్పగించే వారికి ఏకంగా 400 శాతం TDR అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tagatose : డయాబెటిస్ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!
ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, కేవలం సరైన రెవెన్యూ పత్రాలు , యాజమాన్య హక్కులు ఉన్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం కల్పిస్తారు. HMDA, GHMC, HYDRA , MRDCL వంటి ప్రభుత్వ సంస్థలు చేపట్టే పునరుద్ధరణ పనుల కోసం భూమిని అప్పగించిన వెంటనే ఈ TDR సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఒకవేళ సదరు భూమి ఏదైనా వివాదంలో ఉంటే, ఆ సర్టిఫికెట్లను ప్రత్యేక TDR బ్యాంక్‌లో ఉంచి, న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత అసలైన యజమానికి అందజేస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి నగదు రూపంలో భూసేకరణ భారం తగ్గడమే కాకుండా, భూమి కోల్పోయిన రైతులకు లేదా యజమానులకు మార్కెట్ విలువ కంటే రెట్టింపు స్థాయిలో లబ్ధి చేకూరుతుంది. ఈ చర్య ద్వారా నగరంలోని జలవనరులను కాపాడటంతో పాటు వరదల ముప్పును శాశ్వతంగా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, ఈ TDR సర్టిఫికెట్లకు మార్కెట్‌లో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఇకపై నగరంలో 10 అంతస్తులకు మించి నిర్మించే ప్రతి హైరైజ్ భవనంలో, మొత్తం నిర్మిత ప్రాంతం (Built-up Area)లో 10 శాతాన్ని తప్పనిసరిగా TDR ద్వారానే పొందాలని నిబంధన విధించింది. దీనివల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లు తప్పనిసరిగా భూమి కోల్పోయిన బాధితుల నుంచి ఈ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, తద్వారా బాధితులకు త్వరితగతిన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా కాకుండా, భూ యజమానులకు లాభదాయకమైన అవకాశంగా మార్చడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం. సుప్రీం కోర్ట్ , గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటిస్తూనే, ప్రజలకు నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో , పర్యావరణ పరిరక్షణలో కొత్త మార్పులకు నాంది పలకనుంది.