Telangana : తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భారీ వరాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో మొత్తం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం జమ చేసింది. ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా డీఆర్‌డీఏ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి ఏడాది కనీసం రూ.25 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేస్తోందని అధికారులు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు క్రమం తప్పకుండా వడ్డీరహిత రుణాలు ఇస్తూ, వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. తాజాగా విడుదల చేసిన 304 కోట్లు 3,57,098 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేరుగా జమయ్యాయి.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “మా కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన మహిళా పక్షపాత ప్రభుత్వం. ఆడబిడ్డలను ఆర్థికంగా బలపడేందుకు మేము వేల కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం స్వయంగా వడ్డీలు చెల్లిస్తోంది” అని తెలిపారు. అయితే గత ప్రభుత్వాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని, అంతేకాకుండా మహిళలు స్వయంగా చేసిన పొదుపు నిధులను కూడా కాజేసిందని ఆరోపించారు. “అక్కా చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను గత ప్రభుత్వం మింగేసింది. మహిళా సంక్షేమంపై బీఆర్ఎస్ పెద్దలకు మాట్లాడే నైతిక హక్కు లేదు” అని సీతక్క మండిపడ్డారు.
ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, నిధుల విడుదల మాత్రమే కాదు.. వాటిపై పడే వడ్డీలను కూడా సకాలంలో ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మహిళా సంఘాలలో మంచి ఉత్సాహాన్ని నింపింది.