తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. ఈ మేరకు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 19గా ఉంటుంది. మే 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు.
కాగా 2018లో బండ ప్రకాష్‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్‌ను రాజ్యసభకు పంపారు. అయితే అనూహ్యంగా గత ఏడాది బండ ప్రకాష్‌ను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. దీంతో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. అటు తెలంగాణలో మరో రెండు రాజ్యసభ స్థానాలు జూన్ మూడో వారంలో ఖాళీ కానున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లిన డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం జూన్‌లో ముగియనుంది.