CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశానికి రైల్వే ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు పలు విభాగాల అధికారులు కూడా హాజరయ్యారు.
సమావేశంలో ఖమ్మం-విజయవాడ, వరంగల్-మంచిర్యాల, నిజామాబాద్-నాందేడ్, నల్లగొండ-మహబూబ్‌నగర్ రైల్వే మార్గాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు చర్చకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, వాణిజ్యపరమైన లాభాలు కూడా పెరుగుతాయని అధికారులు వివరించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మెట్రో రైలు, MMTS, RTC బస్సుల మధ్య సమన్వయం అవసరమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రాజెక్టుల ఆలస్యానికి నిధుల కొరత ఒక కారణమని అధికారులు పేర్కొనగా, దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయం అందిస్తుందని, కేంద్రం నుంచి కూడా తగిన నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
రాబోయే ఐదేళ్లలో రైల్వే సౌకర్యాలను విస్తృతంగా పెంచాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, కార్గో సర్వీసులు, ఎలక్ట్రిఫికేషన్ పనులను వేగవంతం చేసి రాష్ట్రాన్ని జాతీయ రైల్వే మ్యాప్‌లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని, రవాణా ఖర్చులు తగ్గుతాయని, పరిశ్రమలు–వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సులభ రాకపోకలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
Ramchander Rao : ఖర్గే మాటలు చూస్తే నవ్వొస్తుంది.. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది