Local Body Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఈ మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. మధ్యాహ్నం 1 గంటల వరకు 80.78% పోలింగ్ నమోదయ్యింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన అనంతరం, మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. తొలుత వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. వార్డుల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు.
సర్పంచ్ ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే, తదుపరి ప్రక్రియగా ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక: సర్పంచ్ ఫలితం తేలిన తర్వాత, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు. సాయంత్రానికల్లా మెజారిటీ గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.