తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు అధికారులు. దూర ప్రాంత సర్వీసులకు చార్జీల పెంపుపై ఎలాంటి సమస్య లేకపోయినా… నగర, పల్లెవెలుగు సర్వీసులకు ప్రయాణ దూరం తక్కువగా ఉండడంతో వాటి చార్జీలు ఏవిధంగా పెంచాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తకుండా టికెట్ల ధరను సర్దుబాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల సర్వీసులకు కిలో మీటరుకు పావలా చొప్పున పెంచితే… కొన్ని ప్రాంతాలకు టికెట్ ధర 186 రూపాయలు, ఇంకొన్ని ప్రాంతాలకు 204 రూపాయలకు పెరుగుతాయి ఛార్జీలు. వీటి 200, 240 రూపాయలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. పల్లె, నగర బస్సులకూ ఇదే విధానం అమలు చేయాలన్నది అధికారుల ఆలోచన. ఈ రెండు సర్వీసుల్లో కనీస ఛార్జీలను సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఛార్జీలను సవరించారు. కనీస చార్జీలను సర్దుబాటు చేశారు. ఏడు రూపాయలున్న కనీస ఛార్జీని అయిదు రూపాయలకు తగ్గించి, ఎనిమిది రూపాయిలున్న చార్జీలను పది రూపాయలకు పెంచారు. అలాగే, 12 రూపాయలున్న చార్జీని 15 రూపాయలకు మార్చారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి.
వచ్చే నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిన పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. అయితే, 2010లో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఎస్‌ఎస్‌పీ యాదవ్ బస్సు ఛార్జీలు 25 శాతం పెంచారు. తర్వాత 2011లో చార్జీలు 8 శాతం పెరిగాయి. బస్సు టికెట్ ధరల వల్ల చిల్లర సమస్య వస్తుందంటూ 2012లో ఛార్జీలను సవరించారు. 2013లో 10 శాతం పెంచగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2016లో 10శాతం పెరిగాయి చార్జీలు. అయితే, 2018-19లో ఆర్టీసీ 928 కోట్ల రూపాయల నష్టాలు చవి చూసింది. హైదరాబాద్‌లో 544 కోట్లు, జిల్లాల్లో 384 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం కిలో మీటర్‌కు సగటున 7 రూపాయల పది పైసలు నష్టం వస్తోంది. హైదరాబాద్‌లో కిలో మీటరకు 42 రూపాయల 66 పైసల ఆదాయం వస్తుంటే… 58 రూపాయల 78 పైసలు ఖర్చవుతోంది. ఇందులో సిబ్బంది జీతాలకే 80 శాతం ఖర్చవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ ఛార్జీల పెంపు వల్ల సంస్థ లాభాల్లోకి రాదని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత టికెట్ చార్జీలు 20 శాతం పెరిగాయి. ఇప్పుడు మళ్లీ కిలో మీటరుకు పావలా చొప్పున భారం మోపుతామనడం సరికాదంటున్నారు ప్రయాణికులు.