Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తుంది. వ్యవసాయ శాఖ అందించిన జాబితాల ప్రకారం రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తోంది. అయితే, 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా సీఎం రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. నాలుగు రోజుల్లోనే రికార్డు వేగంతో 6,405 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించింది. గురువారం సాయంత్రం నాటి వరకు రాష్ట్రంలో ఐదు ఎకరాల్లోపూ భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి.
Read Also: IND vs ENG: ఇంగ్లాండ్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మ్యాచుల షెడ్యూల్ ఇలా..
ఇక, ఇప్పటి వరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం ఒక కోటి ఆరు లక్షల (1.06 కోట్లు) ఎకరాల భూములకు పెట్టుబడి సాయం అందింది. ఒక ఎకరంలోపు 24.22 లక్షల మంది రైతులు, రెండెకరాల లోపు 17.02 లక్షల మంది, మూడు ఎకరాల లోపు 10.45 లక్షల మంది, 4 ఎకరాల లోపు 6.33 లక్షల మంది, 5 ఎకరాల లోపు 4.43 లక్షల మంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ఢి పొందారు. వానాకాలం పంటలకు సరైన అదునులో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను వేగంగా చెల్లింపులు చేస్తున్న తీరు కొత్త రికార్డు నెలకొల్పింది.