విద్యా శాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలన్న విద్యా శాఖ సంచాలకుల ఆదేశాలు తెలంగాణలో కలకలం సృష్టించాయి.. దీనిపై విద్యాశాఖలోని ఉద్యోగులు, టీచర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. దీంతో, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను (ఆర్.సి.నంబర్.192-ఎస్టాబ్లిష్ మెంట్-1/2022) తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు మంత్రి సబిత..
Read Also: Telangana Inter Results: ఇంటర్ ఫలితాలపై తర్జన భర్జన
కాగా, విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని మొదట ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ, స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొంది.. దీనిపై ఈనెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి.. అయితే, శుక్రవారం రోజు ఆ ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి.. ఇక, ఈ రోజు పెద్ద రచ్చగా మారింది.. దీనిపై పెద్ద దుమారమే రేగింది.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.. ఉపాధ్యాయులను టార్గెట్ చేసి ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి.. దీంతో, వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. విజిలెన్స్ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారని, వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.