Telangana Government Released GO On Engineering College Fee: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్‌సీ సిఫార్సుల మేరకు.. 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. కాలేజీల్లో మినిమం ఫీజుని రూ. 35 వేల నుంచి రూ. 45 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు రూ. 1 లక్షల దాటింది. ఎంజీఐటీలో గరిష్టంగా రూ. 1.60 లక్షలు ఫీజు కేటాయించగా.. సీవీఆర్‌లో రూ. 1.50 లక్షలు నిర్ణయించారు.
వాసవి, వర్థమాన్, సీబీఐటీ కాలేజీల్లో ఫీజు రూ. 1.40 లక్షలు కాగా.. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, బీవీ రాజు, అనురాగ్ కాలేజీల్లో రూ. 1.35 లక్షలు.. శ్రీనిధి, ఎస్ఆర్, గోకరాజు కాలేజీల్లో రూ. 1.30 లక్షలుగా ఫీజుని నిర్ణయించడం జరిగింది. అలాగే.. ఎంబీఏ, ఎంసీఏ కనీస ఫీజును రూ. 27 వేలు గానూ, ఎంటెక్ మినిమం ఫీజుని రూ. 57 వేలు గానూ పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఫీజుల పెంపు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.