తెలంగాణలో పూర్వ వైభవం తెచ్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 2014 తర్వాత పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఈమధ్యే జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయింది భారత జాతీయ కాంగ్రెస్. పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నెల 14 నుండి 21 వరకు ఎన్నికల కోడ్ లోబడే.. కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర లు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ల పర్మిషన్ లు తీసుకొని యాత్రలు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ లు అనుమతులు ఇవ్వకుంటే.. గాంధీ భవన్ కు ఫిర్యాదు చేయాలని అధిష్టానం జిల్లాల నేతలకు సూచించింది. 31 జిల్లాలకు 50, 60 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంఛార్జి లుగా, డీసీసీ ప్రెసిడెంట్ లు కన్వీనర్ లుగా వుంటారు.
ఖమ్మం జిల్లాకు సంబంధించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, వికారాబాద్ కి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మెదక్ జిల్లాలో దామోదర్ రాజనర్సింహ, దాసోజు శ్రవణ్, వరంగల్ లో కొండా దంపతులు పాదయాత్రలను పర్యవేక్షిస్తారు. సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపి రాజయ్య. కొత్తగూడెంలో పొడెం వీరయ్య, నిర్మల్ జిల్లాలో మహేశ్వర్ రెడ్డి, జనగాం జిల్లాలో పొన్నాల లక్ష్మయ్య పాదయాత్రలను సమన్వయపరుస్తారు. అలాగే ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.