కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్ దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని… గంగానదిలో శవాలు తేలేలా చేసిందని ఆరోపించారు. గంగానదిలో ఈస్థాయిలో శవాలు తేలడం తానెప్పుడూ చూడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ పాలన ఎలా ఉందంటే.. దేశాన్ని అమ్మడం, మతపిచ్చి పెంచి ఓట్లు సంపాదించుకోవడమని కేసీఆర్ విమర్శించారు.
Read Also: ఇదో పనికిమాలిన, పస లేని బడ్జెట్: సీఎం కేసీఆర్
ఇప్పటికే ఎయిరిండియాను అమ్మేశారని, ఎల్‌ఐసీని కూడా అమ్ముతామని బడ్జెట్‌లో నిసిగ్గుగా చెప్పారని కేసీఆర్ ఆరోపించారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని… పెట్టుబడి రెట్టింపు చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. ఎస్సీల జనాభాపై కేంద్రం చెప్తున్న లెక్కలు తప్పు అని… దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్‌కు వస్తే ప్రధాని మోదీకి నిద్రపట్టడం లేదని కేసీఆర్ ఆరోపించారు. అహ్మదాబాద్‌లో కాకుండా హైదరాబాద్‌లో ఎలా పెడతారని ప్రధాని అడ్డుకునే ప్రయత్నం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. బడ్జెట్‌లో నదుల అనుసంధానం మిలీనియం జోక్ అని కేసీఆర్ అభివర్ణించారు. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పారేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.