Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!

  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
  • జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్, పాలు అందించే నిర్ణయం
  • గోదావరి పుష్కరాల కోసం రూ.1000 కోట్ల కేటాయింపుకు ఆమోదం
  • కొత్త పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Cabinet Meeting

Cabinet Meeting

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి భారీ గుడ్ న్యూస్ చెప్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (Government Junior Colleges) కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని (Mid-day Meal Scheme) అమలు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు స్కూళ్లతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం), పాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఆధ్యాత్మిక రంగానికి పెద్దపీట వేస్తూ.. రాబోయే 2027 గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) పనుల కోసం ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపడమే కాకుండా, అందులో మొదటి విడత కింద రూ.300 కోట్లు తక్షణమే మంజూరు చేస్తూ పచ్చజెండా ఊపింది.

మరోవైపు నిరుద్యోగ యువతకు , ఉద్యోగార్థులకు కూడా తెలంగాణ కేబినెట్ సూపర్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్త పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్-టీచింగ్ పోస్టులతో పాటు అవుట్‌సోర్సింగ్ పద్ధతిన మరో 3 పోస్టుల నియామకాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వీటితో పాటు మహబూబాబాద్ జిల్లా కే.సముద్రం (K.Samudram) ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం) నిర్వహణ కోసం మరో 18 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ అటు స్టూడెంట్స్‌కి, ఇటు నిరుద్యోగులకు , భక్తులకు ఎంతో మేలు చేకూర్చేలా సాగింది.