తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధం కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ.. తమ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. మునుగోడులో విజయం మాదేఅంటుంది భారతీయ జనతా పార్టీ.. గత ఉప ఎన్నికల్లో గెలిచినట్టుగానే.. మునుగోడులోనూ బీజేపీ జెండా పాతేస్తాం అంటున్నారు.. ఇక, మునుగోడులో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: TSPSC Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
ఇంటెలిజెన్స్ రిపోర్టులూ, కేసీఆర్ సొంత సర్వేలూ కూడా మునుగోడులో గెలిచేది బీజేపీయే అని చెబుతున్నాయన్నారు బండి సంజయ్.. టీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు నాయకులు భయపడుతున్నారన్న ఆయన.. స్థానిక నేతలను నమ్మకుండా సొంత మనుషులను ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు పంపిణీకి దింపారని ఆరోపించారు.. గెలుపుపై అపనమ్మకంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలకు.. ప్రగతి భవన్ కేంద్రంగా డబ్బు సంచులు పంపిణీ చేశారని సంచలన ఆరోపణలు గుప్పించారు.. అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్మలాటలతో టీఆర్ఎస్ నేతలు సతమతం అవుతున్నారని విమర్శించారు.. బీజేపీని ఓడించేందుకు గుంట నక్క పార్టీలన్నీ ఏకమైయ్యాయని విమర్శించిన ఆయన.. తోక పార్టీలను పట్టుకుని మునుగోడును ఈదే దుస్థితికి కేసీఆర్ వచ్చారని ఎద్దేవా చేశారు.. ఉమ్మడి జిల్లా నేతలంతా మునుగోడుకు తరలివెళ్లండి.. బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేయండి.. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశించబోతోంది.. గుంట నక్క పార్టీల కుట్రలు వివరించి ప్రజలను చైతన్యపర్చండి అంటూ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్ కుమార్.