భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. ఎన్నిక గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బిజెపి తమ పార్టీ ఎంపీలతో పాటు, ఎన్డీఏ ఎంపీలకు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ విధానంపై మాక్ ట్రైనింగ్ జరుగుతోంది.
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తనకు ఓటెయ్యాలంటూ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇండియా కూటమి ఎంపీలను, మద్దతిస్తున్న పార్టీల ముఖ్య నేతలను కలిసి తనను గెలిపించాలని కోరారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక గడువు సమీపిస్తున్న తరుణంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులను ఉద్దేశిస్తూ సుదర్శన్ రెడ్డి ఆ వీడియోలో ప్రసంగించారు. హిందీ ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ వీడియోలు విడుదల చేశారు. రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలందరూ ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని ఆయన కోరారు.
ఆత్మ ప్రబోధంతో ఓటేయడం ఎలా?
భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు మరికొన్ని ఎన్నికలకు విప్ వర్తించదు. దేశంలో విప్ ఉండని ఎన్నికలు అంటే , ఓటర్లుగా ఉండే వాళ్ళు తమ పార్టీ ఆదేశానికి కట్టుబడి కాకుండా, తమ స్వతంత్రత తో ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికలు.
సాధారణంగా లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులపై లేదా తీర్మానాలపై ఓటింగ్ సమయంలో పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి.. అప్పుడప్పుడు ఎవరికి ఓటు వేయాలో పార్టీ సభ్యులకు చెప్తారు కూడా, పార్టీ విప్ ద్వారా ఆదేశాలు జారీ చేశాక, దాన్ని ఉల్లంఘిస్తే సభ్యుడిపై చర్యలు కూడా ఉంటాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విప్ ఉండదు. ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ ఓటు ద్వారా ఎన్నిక జరుగుతుంది. ప్రతి సభ్యుడు తన మనసు, తన నిర్ణయం ప్రకారం ఓటు వేయడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. అందుకే ప్రస్తుతం జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరుతున్నారు.
భారతదేశంలో ఆత్మ ప్రబోధం పనిచేసిన ఎన్నిక
సాధారణంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ , రాష్ట్ర అసెంబ్లీలలో మెజార్టీ ఎవరైతే కలిగి ఉంటారో, వాళ్ల పార్టీ అభ్యర్థి, లేదంటే బలపరిచిన అభ్యర్థి గెలవడం సహజం.కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో క్రాస్-వోటింగ్ లేదా పాలిటికల్ కాంప్లికేషన్స్ వల్ల అనుకోని ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1969 రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆత్మ ప్రబోధం స్వతంత్ర అభ్యర్థిని గెలిచేలా చేసింది. ఆ సమయంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికార పార్టీ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి బరిలో ఉన్నారు. అయితే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆత్మ ప్రబోధం తో ఓటేయండి అంటూ తమ పార్టీ ఎంపీలకే పిలుపునిచ్చారు. దాంతో స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థి వివి గిరి రాష్ట్రపతిగా గెలిచారు. ఇప్పుడు కూడా దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు నేపథ్యంలో కచ్చితంగా ఎంపీలంతా ఆత్మ ప్రబోధంతో ఓటేయాలంటూ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటూ, కాంగ్రెస్ పార్టీ నేతలు, నేతలు పిలుపునిస్తున్నారు. కానీ ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న బిజెపి మాత్రం తమకు మద్దతిస్తున్న ఎంపీల ఓట్లు చీల్చకుండా వ్యూహరచన చేశారు.