శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతా సమేత జగదభిరాముడి శోభయాత్రను భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనాతో రెండు సంవత్సరాలుగా శోభయాత్ర నిర్వహించలేదు. అయితే రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో రామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగునుంది. గంగాబౌలి ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్ర శోభాయమానంగా ప్రారంభం కానుంది.
అయితే శోభాయాత్రలో భారీ హనుమంతుడు, భరత మాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ధూల్ పేట్, జాలీ హనుమాన్, చుడీ బజార్, గౌలి గూడ, మీదుగా హనుమాన్ టేకీడీ లోని హనుమాన్ వ్యయమశాల వరకు శోభాయాత్ర సాగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘాతో పాటు మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.