ఎన్నికల్లో గెలిస్తే ఆ కిక్కే వేరు. గెలిచిన వారి సంబరాలకు.. సంతోషాలకు హద్దే ఉండదు. చేతి చమురు వదిలించుకున్నాక.. ఆ ఎన్నికలు రద్దయితే..? మింగలేక… కక్కలేక ఇబ్బంది పడతారు నాయకులు. ఏపీలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన వారి పరిస్థితి అలాగే ఉందట. భవిష్యత్ ఏంటో తెలియక తలపట్టుకున్నట్టు సమాచారం.
తదుపరి వ్యూహం ఏంటో తెలియడం లేదట
ఆంధ్రప్రదేశ్‌లో MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారట. ఎన్నికలు పూర్తయినా.. నిబంధనల ప్రకారం ప్రక్రియ చేపట్టలేదని హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి తదుపరి వ్యూహం ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారట.
ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 2020లో అప్పటి ఎన్నికల కమిషనర్ ప్రకటన చేసినప్పుడు మొదలైన ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. 2020లో షెడ్యూల్ విడుదల చేస్తే.. కరోనా కారణంగా వాయిదా వేశారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు విడతల వారీగా జరిగాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మార్చిలో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వచ్చేశాయి. అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడాది తర్వాతైనా ఒత్తిడి నుంచి బయటపడ్డామని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది.
డివిజన్ బెంచ్ ఆదేశాలతో నాడు ఊపిరి పీల్చుకున్నారు
పరిషత్ ఎన్నికల నిర్వహణను సవాలు చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేనలు హైకోర్టుకు వెళ్లాయి. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది. అప్పటికే ప్రచారంతోపాటు అన్ని పనులు పూర్తి చేసుకుని పోలింగ్‌కు సిద్ధమైన అభ్యర్థులు టెన్షన్ పడ్డారు. ఇంతలో డివిజన్ బెంచ్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రిలీఫ్ ఇచ్చినట్టు ఫీలయ్యారు. ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని చెప్పినా.. దానికీ లైన్ క్లియర్ అవుతుందని ఆశించారు అభ్యర్థులు. కానీ.. ఎన్నికల ప్రక్రియను రద్దు చేసింది హైకోర్టు. ఆ తీర్పు బరిలో ఉన్న అభ్యర్థులకు షాక్ ఇచ్చింది.
ఇంకా అప్పీలుకు వెళ్లని రాష్ట్ర ఎన్నికల సంఘం!
అటూ ఇటూ కాకుండా పోయామని అభ్యర్థులు దిగులు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు జడ్జిమెంట్‌లో ఉంది. తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా అప్పీల్‌కు వెళ్లలేదట. న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో కూడా అర్థం కావడం లేదట. తమతోపాటు పోటీ చేసిన పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అభ్యర్థులు గెలిచి పదవుల్లో హోదా వెలగపెడుతుంటే తమ పరిస్థితే ఎటూ కాకుండా పోయిందని ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారట. మరి.. ఈ సమస్యకు ఎండ్ కార్డు పడుతుందో.. లేక మొదటి నుంచి శ్రీకారం చుడతారో చూడాలి.