హైదరాబాద్ మియాపూర్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రహ్మానందం (22) మిస్సింగ్ మిస్టరీగా మారింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం బయటకు వెళ్లి తమ కుమారుడు తిరిగిరాలేదని తల్లిదండ్రులు నరసింహారావు, నాగలక్ష్మీ దంపతులు ఆరోపిస్తున్నారు. 2019 జూలై 3న ఆఫీసుకు వెళ్లి అదృశ్యమయ్యాడని… అప్పటి నుంచి ఇంటికి రాలేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులో మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయిందని… ఆ తర్వాత బ్రహ్మానందం ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని.. దీంతో పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని తల్లిదండ్రులు చెప్తున్నారు.
Read Also: ‘దిశ’ అరాచకానికి రెండేళ్లు.. ఇంకా పెరుగుతున్న కామాంధులు
అయితే బ్రహ్మానందం మిస్సింగ్ అవ్వడానికి ముందు రెండు రోజులు ఆఫీసుకు వెళ్లకుండా ఓ వ్యక్తి ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి కూతురుతో బ్రహ్మానందం సన్నిహితంగా మెలిగాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, పోలీసులు ఎంత విచారణ చేపట్టినా ఇప్పటివరకు బ్రహ్మానందం ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఇప్పటికైనా దర్యాప్తు ముమ్మరం చేయాలని బ్రహ్మానందం తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులను కోరుతున్నారు. తమ చిన్న కుమారుడు ఏడేళ్లకే అనారోగ్యం కారణంగా చనిపోయాడని.. ఇప్పుడు చేతికి అందివచ్చిన కుమారుడు అనుమానాస్పద రీతిలో మిస్సింగ్ కావడంతో అసలు తమ కుమారుడు బతికి ఉన్నాడో లేదో చెప్పాలని రోధిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చిందో పోలీసులు వెల్లడించాల్సి ఉంది.