Chada Venkat Reddy: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో సీపీఐ మండల మహాసభలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను అంతం చేయడం ప్రపంచశాంతికి శుభ పరిణామం అన్నారు. నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా కక్ష ధోరణి వైఖరితో కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం అన్నారు. ఇప్పటికే వందల మంది మావోయిస్టులను చంపడం రాజ్యాంగ విరుద్ధం.. అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.. వామపక్ష పార్టీలన్నీ ఖగర్ ఆపరేషన్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయి.. నక్సలైట్లతో ప్రధాని మోడీ, అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలి అని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Jaipur: ఆభరణాల్లో వాటా కోసం తల్లి అంత్యక్రయలు ఆపిన కుమారుడు..(వీడియో)
అయితే, కొత్త ఆసుపత్రి నిర్మాణం పేరుతో ఇప్పుడు కొనసాగుతున్న హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి భవనాన్ని కూల్చివేయద్దు అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంత వరప్రదాయాన్ని గౌరవెల్లి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ పూర్తి చేయలేదు అని ఆరోపించారు. ఇప్పుడు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రెండేళ్లు గడుస్తున్నప్పటికీ 437 కోట్ల రూపాయలు తీసుకువచ్చాను అంటున్నాడు కానీ ప్రాజెక్టు పనులు మాత్రం పూర్తి కావడం లేదని విమర్శలు గుప్పించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్ తో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.