Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి బలోపేతానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా సమాఖ్యల సమావేశంలో ఆమె కీలక ప్రసంగం చేశారు. మహిళా శక్తి, మహిళా సంఘాల భవిష్యత్ దిశ, వారి సామాజిక పాత్రపై పలు కీలక అంశాలను వివరించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర అభివృద్ధి మహిళల శక్తి మీదే ఆధారపడి ఉందన్నారు. కింది స్థాయి మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకుని ముందుకు సాగేందుకు మహిళా సమాఖ్యలు మార్గనిర్దేశం చేయాలని కోరారు. లోన్లు పొందడంలో, చిన్న వ్యాపారాలు ప్రారంభించడంలో, ఆర్థికంగా స్థిరపడడంలో సమాఖ్యలు మహిళలకు తోడ్పడాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, కుటుంబాల అభ్యున్నతిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. భారత రాజ్యాంగంపై ప్రసంగం!
అన్యాయాలు ఎదురైన ప్రతి ఆడబిడ్డకు మహిళా సమాఖ్యలు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. “ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడాలి. మహిళల ఐకమత్యం ముందు ఎవ్వరూ నిలవలేరు” అని సీతక్క చెప్పారు. గ్రామాల్లో, పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళా సంఘాలు మరింత క్రియాశీలకంగా ఉండాలని ఆమె సూచించారు.
“65 లక్షల మహిళా సమాఖ్య సభ్యులు పిడికిళ్లు బిగిస్తే లోకం మారిపోతుంది. చీకటి మాయం అవుతుంది” అని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళా శక్తి బలోపేతం కోసం భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు అందజేస్తామని, ఇవే మహిళా సంఘాల బ్రాండ్‌గా నిలుస్తాయని మంత్రి తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడవద్దని, ప్రజా ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని, తాను వ్యక్తిగతంగా కూడా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మహిళలు ధైర్యంగా నిలబడి చరిత్ర సృష్టించాలని, సమ్మక్క–సారలమ్మ, రాణి రుద్రమ, ఇందిరా గాంధీలా సామర్థ్యాన్ని చాటుకోవాలని సీతక్క పిలుపునిచ్చారు.