సంచలనం రేపిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో ఇద్దరు నిందితుల ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. పోలీసులు భావించినట్లుగానే నిందితులను కస్టడీకి తీసుకోవడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన చెల్లెలు అశ్రిన్ మతాంతర వివాహం చేసుకుందన్న పగతో మరో బంధువుతో కలసి.. చెల్లెలు భర్త నాగరాజును నడి రోడ్డుపై అన్న దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో ఇద్దరు నిందితులైన సయ్యద్ మొబిన్, మసూద్ అహ్మద్ పథకం ప్రకారమే నాగరాజును హత్య చేశారని పోలీసులు తేల్చారు. నాగరాజు ఎక్కడున్నాడో జీమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి గుర్తించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరు నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ సేకరించారు. హత్య ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులతో తప్ప నిందితులు ఎవ్వరితో మాట్లాడలేదని పోలీసులు.
మసూద్ తన ఈమెయిల్ లాగిన్‌కు ఐడీ, పాస్వర్డ్‌కు తన మొబైల్ నంబర్‌నే పెట్టుకున్నాడని.. అదే ట్రిక్‌ను నాగరాజు మెయిల్‌ను హ్యాక్ చేసేందుకు మసూద్ ప్రయోగించాడని పోలీసులు తెలిపారు. అది వర్కౌట్ కావడంతో జీమెయిల్ ద్వారా ఫైండ్ మై డివైస్‌లోకి వెళ్లి నాగరాజు లొకేషన్‌ను నిందితులిద్దరూ కనుక్కున్నట్లు వెల్లడించారు. కొన్ని ముస్లిం సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు.
ఇద్దరు నిందితులకు ఎటువంటి సంస్థతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరే హత్యకు కుట్ర పన్నారని వెల్లడించారు. సరూర్‌నగర్‌లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేశామన్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు..
కాగా.. బుధవారం (May 4 2022) నాడు రాత్రి సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే Bike పై వెళ్తున్న నాగరాజును అత్యంత దారుణంగా హత్య చేశారు నిందితులు. నాగరాజు తలకు హెల్మెట్ పెట్టుకొన్నప్పటికీ ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమయంలో ఆశ్రిన్ నాగరాజుపై దాడి చేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. నాగరాజున చంపిన వారిలో ఆశ్రిన్ సోదరుడితో పాటు బావను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
మరోవైపు నాగరాజును హత్య చేసిన నిందితులను తమకు చూపించాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం నాడు ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని నాగరాజు స్వగ్రామానికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించేందుకు పోలీసులు ఇచ్చిన డబ్బును కూడా నాగరాజు కుటుంబ సభ్యులు తిరస్కరించారు.