జీవితమే ఒక పరీక్ష. అందులో మనం పరీక్ష రాస్తూనే వుంటాం. ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు హాజరవుతూనే వుంటాం. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఒక్క నిముషం ఆలస్యం అయినా చాలామందికి పరీక్ష రాసే అవకాశం లభించలేదు. పరీక్ష కేంద్రం వద్ద చంటి పిల్లలతో ఎగ్జామ్ రాయటానికి వచ్చిన తల్లులు ఉయ్యాలలు ఏర్పాటు చేసుకున్నారు.
తల్లులతో పాటు వారి భర్తలు, కుటుంబ సభ్యులు తోడుగా వచ్చారు. చంటి పిల్లల్ని తమ బంధువులకు అప్పగించిన తల్లి పరీక్ష రాయడానికి వెళితే వారిని సముదాయిస్తూ కనిపించారు ఎందరో. ఇవన్నీ చూస్తుంటే.. అమ్మతనం ముందు టెట్ పరీక్ష అయినా మరేదైనా ఓడిపోతుందనిపిస్తుంది. తల్లి టెట్ ఎగ్జామ్ కి వెళ్ళిపోయింది.. తండ్రి బిడ్డను తీసుకుని జోల పాట పాడుతున్నాడు. రెండు చెట్టు కొమ్మల మధ్య చీరను కట్టేసి దానిని ఊయలగా తయారు చేసి బిడ్డకు జోల పాట పాడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. అత్తాపూర్ లోని డొనాల్డ్ మెమోరియల్ స్కూల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
గద్వాల నుండి టెట్ పరీక్షకు వచ్చిన ఆ తల్లి పేరు శ్యామల. టెట్ ఎగ్జామ్ కోసం అత్తాపూర్ లోని శివ నగర్ కాలనీలో ఉన్నటువంటి డోనాల్డ్ మెమోరియల్ స్కూల్ లో ఆమెకు సెంటర్ పడింది. పరీక్ష రాయకతప్పదు. కొలువు సాధించకతప్పదు. ఈ ప్రయాణంలో మధ్య మధ్యలో ఇలాంటి మజిలీలు వుండనే వుంటాయి. తల్లో, చెల్లో, భర్తో, అన్నో తమ్ముడో, మరిదో, తండ్రో ఎవరో ఒకరు వారికి సాయంగా నిలబడతారు. ఈరోజుల్లో అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఇలాంటి చిన్నచిన్న కష్టాలు తప్పవు. వాటిని ఇష్టంగా మలచుకుని, కోరుకున్న కొలువును సాధిస్తూ వుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలు మీడియా కంట పడ్డాయి.