తీగ లాగితే డొంక కదిలిందే అనే సామెత మనం వినే ఉంటాం. అలాంటి సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొందరు దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేసి పరారయ్యారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. అయితే.. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్ అకూన్ గురించి వెల్లడించాడు.
నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్ పేర్కొన్నాడు. దీంతో అకూన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా.. 31 ఆధార్‌కార్డులు, 13 పాన్‌కార్డులు, 90 ఆధార్ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. అంతేకాకుండా హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. అయితే మిగితా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.