మేడారం మహా జాతర మూడవరోజుకి చేరుకుంది. వనమంతా జనంగా మారిపోయింది. ఇవాళ సెలవు రోజు కూడా కావడంతో భక్తులు మేడారంకి పోటెత్తుతున్నారు.ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మేడారం జాతర పరిసరాల్లో 33 పార్కింగ్ పాయింట్లు, 37 హాల్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ 3,845 బస్సులను నడుపుతోంది. ఆర్టీసీతో పాటు ఎడ్లబండ్లు, స్వంత వాహనాలకు తోడు వీఐపీల కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులో వున్నాయి. కోటిన్నరమంది భక్తులు సమ్మక్కసారక్కలను దర్శించుకోనున్నారు. బంగారంగా పిలిచే బెల్లాన్ని నైవేద్యంగా అందించడం ఆనవాయితీ. దీంతో బంగారం అమ్మే షాపులు కిటకిటలాడుతున్నాయి.
జాతర నేపథ్యంలో www.medaramjathara.com అనే వెబ్‌సైట్ ద్వారా జాతరలోని విశేషాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన మరుగుదొడ్ల వివరాలు, స్నాన ఘట్టాలు, కళ్యాణ కట్టల వివరాలు, ఆర్టీసీ బస్టాండ్ వివరాలు, పార్కింగ్ స్థలాలవంటి వాటిని పొందుపరిచారు. భక్తులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా అమలుచేస్తున్నారు. కరోనా వల్ల గిరిజన జాతర ప్రారంభం కాకముందునుంచే ఫిబ్రవరి మొదటివారం నుంచే భక్తులు మేడారానికి పోటెత్తారు.