తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన సాహితీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేసులో సిసిఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ విలువ ఏకంగా రూ. 3,000 కోట్లు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం.
సాహితీ ఇన్‌ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో భారీగా నిధులు వసూలు చేశారు. తక్కువ ధరకే ప్లాట్లు , ఫ్లాట్లు ఇస్తామంటూ నమ్మబలికి వేల మంది బాధితుల నుండి డబ్బులు వసూలు చేశారు. అయితే, వసూలు చేసిన ఈ మొత్తాన్ని ప్రాజెక్టుల కోసం వాడకుండా, తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ స్కామ్‌లో భాగంగా మొత్తం 64 కేసులు నమోదు కాగా, పోలీసులు అన్నింటిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా అమీన్‌పూర్‌లోని ‘శర్వాణి ఎలైట్’ ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. ఈ 17 కేసులకు సంబంధించి పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఒక్క శర్వాణి ఎలైట్ పేరుతోనే బాధితుల నుండి రూ. 500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.
ఈ భారీ స్కామ్‌లో కేవలం లక్ష్మీనారాయణ మాత్రమే కాకుండా, అతనికి సహకరించిన మొత్తం 13 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్ షీట్ రూపొందించారు. వేల మంది బాధితులు తమ కష్టార్జితం తిరిగి వస్తుందని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణంలో, పోలీసుల ఈ చర్య బాధితుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. సాహితీ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలతో కోర్టు ముందు హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.
Trivikram-Sunil : ఒకే రోజున పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్-సునీల్