టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పాత ఆనవాళ్ళు, మూఢాచారాలు మాత్రం మానడంలేదు. ఎక్కడో చోట క్షుద్రపూజలు, చేతబడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భార్యతో క్షుద్ర పూజలు చేయించాడో ఆర్ఎంపీ భర్త. పూజారితో సంసారం చేయాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడా భర్త. దీనికి ఒప్పుకోని భార్య తప్పించుకుపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఖమ్మం జిల్లా మధిరలో ఓ ఆర్ఎంపీ భర్త నిర్వాకం ఇది. తన భార్య చేత క్షుద్ర పూజలు చేయించి పూజారితో సంసారం చేయాలంటూ ఒత్తిడి చేయడంతో భార్య ఇంట్లో నుంచి తప్పించుకుంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధిరకు చెందిన ఆర్ఎంపీ శ్రీనివాస్ కు పదేళ్ళ క్రితం వివాహం అయింది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాడు. ఏదో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
తనకున్న మిత్రుల్లో ఓ మిత్రుడు క్షుద్ర పూజలు చేస్తే గ్రహస్థితి బాగుపడి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని సలహా ఇచ్చాడు. దీంతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వజినే పల్లికి చెందిన పూజారిని సంప్రదించాడు ఆర్ఎంపీ వైద్యుడు. పూజల అనంతరం ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ధనవంతుడివి అవుతావని చెప్పి పూజా విధానం తెలియజేశాడా పూజారి. అందుకు అంగీకరించిన ఆర్ఎంపీ వైద్యుడు తన ఇంట్లో భార్య చేత క్షుద్ర పూజలు చేయించాడు. అనంతరం పూజారితో సంసారం చేయమని ఒత్తిడి చేశాడు. దీనికి ససేమిరా అన్న భార్య ఇంట్లోనుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.