CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు

  • ఆగస్టు 15లోపు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం
  • నాణ్యతపై రాజీపడొద్దని అధికారులకు హెచ్చరిక
  • విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తప్పనిసరి
  • వచ్చే ఏడాదికి ముందస్తు ప్రణాళిక సిద్ధం
Cm Revanth

Cm Revanth

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల పంపిణీ, నాణ్యతపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ (MCRHRD) బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ఇచ్చే దుస్తుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పేద పిల్లల భవిష్యత్తు, సంక్షేమం కోసం పనిచేస్తున్నామనే భావనతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యూనిఫాంల పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమయానికి యూనిఫాంలను కుట్టి సరఫరా చేసేలా సంబంధిత ఏజెన్సీలు, సంస్థలపై ఒత్తిడి పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని విద్యార్థులందరికీ యూనిఫాంలు పూర్తిస్థాయిలో అందజేయాలని గడువు విధించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల పాఠశాల దుస్తుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని విమర్శించిన సీఎం, ఇకపై అలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు. అంతేకాకుండా, వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2వ తేదీ) నాటికే విద్యార్థులందరికీ యూనిఫాంలు సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.

ఈసారి ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి నుంచి యూనిఫాంల నాణ్యత, ఫిట్టింగ్‌పై అభిప్రాయ సేకరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే వచ్చే ఏడాది పంపిణీకి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో పాటు విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.