టీకాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వడం అంటే.. కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని అభివర్ణించారు. సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వాళ్లంతా సోనియా గాంధీ కుటుంబ సభ్యులని, చిల్లర మల్లరా పార్టీలకు మనకు పోటీ కాదని అన్నారు. దేశ ప్రజల బానిస సంకెళ్లు తెంచిన పార్టీ కాంగ్రెస్ అని, దేశం కోసం కొట్లాడింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.
మిగిలిన పార్టీల్లో సగం మంది లోఫర్ లు, ఇంకొంత మంది బ్రోకర్లు ఉన్నారని విమర్శించారు. మేము రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి పార్టీలో సభ్యులం అని చెప్పుకోవడం గర్వంగా ఉందని, 30 లక్షల సభ్యత్వం నమోదు చేస్తాం అని సోనియా గాంధీకి మాట ఇచ్చామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మీద నమ్మకం తో సోనియాగాంధీ కి మాట ఇచ్చామని తెలిపారు.
ఈ నెల 9 న ట్రైనింగ్ క్లాసులు, 14 వ తేదీ నుండి 21 వరకు జన జాగరణ యాత్ర, డిసెంబర్ 9 న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనుమతిస్తే పరేడ్ గ్రౌండ్, లేదంటే నగర శివారులో రాహుల్ గాంధీ తో సభ ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 26తో సభ్యత్వ నమోదు ముగింపు ఉంటుందన్నారు. ‘వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, సభ్యత్వం కోసం జనం లోకి వెళ్ళండి, మా పదవులు తాత్కాలికం.. కానీ కాంగ్రెస్ సభ్యుత్వం అనేది శాశ్వతం’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.