కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. ఎన్నికలకు మరో ఎడాదిన్నర ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్… దాన్ని మాత్రం ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పార్టీలో నెలకొన్న అసమ్మతిని తగ్గించేందుకు ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.
దీంతో పాటు ఇటీవల వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా జరిగిన రైతు సంఘర్షణ యాత్ర సక్సెస్ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలోని ప్రజలకు వరంగల్ డిక్లరేషన్ చేరేలా కార్యక్రమాలు చేపడుతోంది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కోడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తుంకి మెట్ల లో పర్యటన ప్రారంభం అయింది. అంగడి రాయచూరు, చంద్రకల్ రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక కాంగ్రెస్ నేతలు, స్థానిక నేతలు, కార్యకర్తలు రైతు రచ్చబండలో పాల్గొననున్నారు. వరంగల్ లో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ ను రైతులకు, ప్రజలకు వివరించనున్నారు.