కృష్ణా నదీ జలాల పంపిణీ , పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ నేతలు బహిష్కరించి వెళ్లిన నేపథ్యంలో, ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో గత పదేళ్లలో జరిగిన జాప్యం, ఎదురైన ఆటంకాలపై వాస్తవాలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కృష్ణా జలాల వాటాను కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేస్తూ అంగీకరించడం వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు జరిగిన నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నేతలకు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌తో కొనసాగుతున్న జల వివాదాలు, కృష్ణా జలాల పంపిణీ అంశాలపై నాయకులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను వివరించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Off The Record: ఆ మంత్రికి పదవి మూన్నాళ్ళ ముచ్చటేనా? మాజీ క్రికెటర్ ఆశలు అడియాశలేనా?