CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- పెట్టుబడిదారులకు భద్రత కల్పించడం నా బాధ్యత
- డిసెంబర్లో హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
- ప్రపంచ నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూチャー సిటీ’లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించారు. సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా వెలిగిందని, విదేశీ వ్యాపారులు చార్మినార్ వద్దకు వచ్చి ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. నిజాం రాజుల అద్భుత కట్టడాలు, మ్యూజియం, విమానాశ్రయం, రైల్వేలతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) వంటి విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి మేధావులను అందించాయని వివరించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ వంటి ప్రముఖులంతా ఇక్కడ చదువుకున్నవారేనని కొనియాడారు.
రాజీవ్, పీవీ సంస్కరణల దార్శనికత.. ఇన్వెస్టర్లకు అభయం
కంప్యూటర్, టెలికాం విప్లవానికి నాంది పలికిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హైదరాబాద్‌లోనే పైలట్‌గా శిక్షణ పొందారని, అందుకే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టుకున్నామని సీఎం తెలిపారు. అలాగే 1991లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఎల్పీజీ (LPG) సంస్కరణలతో గట్టెక్కించిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవలను స్మరించుకున్నారు. 1991 నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ మద్దతుగా నిలిచారన్నారు. “తెలంగాణలో మీరు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి భద్రత కల్పించడం, అది వృద్ధి చెందేలా చూడడం నా వ్యక్తిగత బాధ్యత. మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు నేను సంరక్షకుడిగా ఉంటా. మీరు అనుకున్న పెట్టుబడి, లాభాల అంచనాలను రెట్టింపు చేయండి.. మీకు కావాల్సిన విధానపరమైన మద్దతు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని సీఎం అభయమిచ్చారు.
Also Read
- Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
- Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలని ఆకాంక్షించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలపై పెట్టుబడిదారులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పినట్లు అభివృద్ధి విషయంలో ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
గ్లోబల్ సిటీలతోనే హైదరాబాద్ పోటీ
దేశంలో కేంద్రం ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో 3 కారిడార్లు (హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె) మన నగరానికే రానున్నాయని సీఎం వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్డు (RRR), మెట్రో విస్తరణ వంటి పనుల్లో కేంద్ర సహకారం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇప్పుడు ఢిల్లీ, ముంబై, బెంగళూరులతో కాకుండా న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలని సీఎం పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులు ఇచ్చే ఉత్తమ ఆలోచనలను ప్రభుత్వ విధానాలుగా మారుస్తామని, తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?