నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 11 యేండ్ల పాటు సైలెంట్‌గా ఉండి… ఇప్పుడు ఏదో నోటీసులు ఇచ్చారు.. తల్లి ఆపదలో ఉంటే అండగా ఉండాలి కొడుకు.. అలాంటి కొడుకుని ఈడీ విచారణ పేరుతో అర్థరాత్రి వరకు ఈడీ ఆఫీస్ కి రప్పించారు.. విచారణ చేసి పీకేది ఏం లేదు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. రాహుల్ బయట తిరగకుండా ఆపాలని మోడీ కుట్ర చేస్తున్నారని, మోడీ..ఇంత బరితెగింపు పనికి రాదని ఆయన మండిపడ్డారు.
మోడీ..అమిత్ షా లది నేరగాళ్ల మనస్తత్వమని, రాక్షస ఆనందంకి రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. అర్థరాత్రి వరకు ఆఫీస్ లో నిర్బంధించి విచారణ చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. ఉదయం 10 నుండి 6 గంటల వరకే కదా విచారణ చేయాల్సిందని రేవంత్ వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని, బదిలీ అవుతుంది.. ఆప్పుడు వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. అధికారులు కూడా జాగ్రతగా ఉండండని, . పదవులు ఇచ్చారని… రాజకీయ బాసుల మాటలకు తలొగ్గి పని చేయకండని ఆయన హితవు పలికారు. రెండు సార్లు ఓడితే..నాలుగు సార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్ అని, 300 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.