తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చాటిచెప్పారు. పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా జల వివాదాల విషయంలో రాజకీయ లబ్ధి కంటే రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు. “తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా నన్ను అడిగితే.. నేను నిస్సందేహంగా నీళ్లే కావాలని కోరుకుంటాను. మాకు వివాదాలు వద్దు.. పరిష్కారాలే కావాలి” అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వేదికగా ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి ఉన్న ప్రాజెక్టుల అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని ఆయన కోరారు. “ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. దీనివల్ల రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. మేము ఏపీతో వివాదాన్ని కోరుకోవడం లేదు, కేవలం పరిష్కారం మాత్రమే కోరుకుంటున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ భూపరివేష్టిత (Landlocked) రాష్ట్రం కావడంతో, అభివృద్ధి కోసం పొరుగు రాష్ట్రాల సహకారం అనివార్యమని సీఎం గుర్తు చేశారు. “తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు లేదా మహారాష్ట్ర అయినా.. మేము అందరితో పరస్పర సహకారమే కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు సామరస్యంగా చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి” అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టడం తమకు ఇష్టం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఏపీతో చర్చల ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని, కేవలం ప్రజల మరియు రైతుల బాగు కోసమే తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని భరోసా ఇచ్చారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.