సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: లైంగికదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన మాజీ స్పీకర్..
అయితే, నిన్న పార్లమెంట్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన డీఎస్.. కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.. ఈ వ్యవహారంపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడాల్సిందిగా.. పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టికి కబురు పంపించి అధిష్టానం.. కానీ, చివరి నిమిషంలో ఇది రద్దు అయినట్టుగా తెలుస్తోంది.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నా.. సీఎల్పీ నేత భట్టి హస్తిన పర్యటన మాత్రం వాయిదా పడింది. ఇక, డీఎస్ పార్టీలోకి తిరిగి వస్తే తలెత్తే పరిస్థితులు ఏంటి? నిజామాబాద్ నేతలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి..? కాంగ్రెస్‌ను కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని దెబ్బ కొట్టిన డీఎస్.. తిరిగి పార్టీలో చేర్చుకుంటే ఉత్పన్నం అయ్యే సమస్యలు, నేతలకు ఉన్న అభ్యంతరాలపై కూడా పార్టీ అధిష్టానం దృష్టిపెట్టినట్టుగా సమాచారం. అయితే, పార్టీ అధినేత్రి సోనియానే గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. డీఎస్ చేరికను ఆపేది ఎవరు ? అనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.