ఓ వైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజాప్రతినిధులు కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్నాయి నిబంధనలు పాటించండి అంటూ చెబుతున్నా.. మరో పక్క అధికార టీఆర్‌ఎస్ నాయకులే నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రైతుబంధు సంబురాల పేరిట మంత్రులు ఎమ్మెల్యేలు, వారి వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలు, రైతులతో కలిసి భారీ కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నారు. వందల సంఖ్యలో ఒకే దగ్గర గూమిగూడటంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యే ప్రమాదముంది. ఇదే సమయంలో సంక్రాంతి పండుగ సైతం రావడంతో కేసుల సంఖ్య పేరిగే అవకాశం ఉంది.
Read Also: తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది : కేటీఆర్
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కాగా ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే రైతుబంధు ఉత్సవాల్లో కరోనా నిబంధనలు పాటించాలంటూ సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో సైతం రోజు రోజుకు కోవిడ్ కేసులు పెగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో రైతుబంధు సంబురాలపేరిట నిబంధనలను తుంగలో తొక్కితే కరోనా ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదముందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.