తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గత కొద్దికాలంగా మౌనంగా వున్నారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి పోలేదు. నివురు గప్పిన నిప్పులా కాచుకుని ఉన్నా అన్నారు. గ్రూపు రాజకీయాలు వద్దనే నేను సైలెంట్ గా ఉన్నాను. నా కంటే బెటర్ గా చేస్తారని వెయిట్ చేశాను. గెలుపు కోసం జిల్లాలు మార్చే నేతలు ఉన్నారు. గెలిచినా, ఓడినా నేను ఖమ్మం ఆడ బిడ్డగానే ఉంటానన్నారు.
నాకు పదవులు ముఖ్యం కాదు..కార్యకర్తల మనోభీష్టానికి అనుగుణంగానే నడుచుకుంటా. నాకు రాజకీయ వారసులు లేరు. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ..అది ఎక్కడికి పోదు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. తిరుగుబాటు వచ్చేది ఖమ్మం నుంచే. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పువ్వాడ అజయ్ కాదు ఆయన బాబు కూడా నాకు తెలుసు. వాళ్ళందరికీ నేను భయపడను. కాంగ్రెస్ అంటే సామాన్యం కాదు కాంగ్రెస్ అంటే ఫైర్ అంటూ పుష్ప డైలాగ్ కొట్టారు రేణుక చౌదరి.
దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్రమోడీవి కేవలం మాటలు మాత్రమే. కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉక్రెయిన్ సైనికుల్లా పోరాడాలి. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత నిరుత్సాహం వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు మరో స్వతంత్ర సంగ్రామం కోసం పోరాడాల్సిన అవసరం వుంది. రాష్ట్రానికి, దేశానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగల్లా తయారు అయ్యాయి. రాష్ట్రంలో ఉన్నవి ఇందిరమ్మ ఇళ్లు మాత్రమే. కేసిఆర్ డబుల్ బెడ్ రూం ఇల్లు ఎక్కడ లేవు.. ఉన్నా నాసిరకంగా వున్నాయన్నారు రేణుకా చౌదరి.