Real Estate Dealer Sai Krishna Kidnapped And Tortured: ఆర్థిక లావాదేవీలు, పాత కక్షల కారణంగా.. హైదరాబాద్‌లో సాయి కృష్ణ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసిన వైనం తీవ్ర కలకలం రేపుతోంది. శ్యామ్ కుమార్ అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. పంజాగుట్ట కాకతీయ హోటల్ వద్ద సాయి కృష్ణను కిడ్నాప్ చేశారు. అతని కళ్లకు గంతలు కట్టి.. హైదరాబాద్ మొత్తం కారులో తిప్పారు. ఈ క్రమంలో అతడ్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేయడంతో పాటు రియల్టర్ ఏటీఎం లాక్కొని, డబ్బులు డ్రా చేశారు. అనంతరం ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోగా.. సాయి కృష్ణ పోలీసుల్ని ఆశ్రయించాడు.
తనకు, శ్యామ్ కుమార్‌కు ఆర్థిక పరమైన వివాదాలు ఉన్నాయని.. గతంలోనే తాను డబ్బులకు బదులు తన భూమిని అతని పేరుపై రిజిస్ట్రేషన్ చేశానని సాయి కృష్ణ తెలిపాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలంటూ వేధిస్తున్నాడని, రాజకీయ నేతల సహకారంతో వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పాడు. ‘నీ భార్యను నా దగ్గరకు పంపితే వదిలేస్తాను’ అని శ్యామ్ కుమార్ టార్చర్ పెడుతున్నాడంటూ మొరపెట్టుకున్నాడు. తనని చాలాసార్లు అసభ్యంగా దూషించడంతో పాటు తన ఇండిపై దాడి కూడా చేశారని, ఇప్పుడు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడని వాపోయాడు. కాళ్ళు వాపులు వచ్చేలా కొట్టారని, శ్యామ్ కుమార్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని సాయి కృష్ణ వేడుకుంటున్నాడు.