ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కష్టాలు పేదలను సతాయిస్తున్నాయి. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వర్ డౌన్ సమస్యలతో ఇప్పటి వరకు 40 శాతం మందికి కూడా పంపిణీ జరగలేదు. మరోవైపు రేషన్ బియ్యం ఇచ్చే గడువు 15తో ముగియడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. తమకు రేషన్ బియ్యం అందుతాయా లేదా అని వారు ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తరచూ సర్వర్ సమస్యలు రావడంతో రేషన్ బియ్యం పంపిణీకి అడ్డంకిగా మారింది. నల్గొండ, సూర్య పేట, యాదాద్రి జిల్లాలో కలిపి 991 రేషన్ షాపులు ఉన్నాయి. 9 లక్షల 96 వేల 871 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. సర్వర్ డౌన్ సమస్యల తో బియ్యం పంపిణీ లో జాప్యం జరుగుతుంది. ఒక్కో రేషన్ షాప్ లో రోజుకి వంద మందికి రేషన్ బియ్యం ఇచ్చేవారు. ప్రస్తుతం రోజుకి 30 మంది వరకే బియ్యం పంపిణీ జరుగుతోంది. బయోమెట్రిక్ విధానంలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 15 లోపు రేషన్ బియ్యం కోటా ఇవ్వాలి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గడువు పొడిగిస్తే తప్ప, డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు అవకాశం ఉండదు. వేలిముద్రలు పడక, సర్వర్ డౌన్ సమస్యల వల్ల విసిగిపోతున్నారు లబ్ధిదారులు. తమకు రేషన్ అందలేదని గడువు పొడిగించి బియ్యం ఇవ్వాలని రేషన్ కార్డుదారులు కోరుతున్నారు.