రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల పోలీస్ అధికారులు చేసిన పనికి అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మార్చి 26వ తేదీన మంచిర్యాల టౌన్ పరిధికి చెందిన సాగి మురళీధర్ రావు తండ్రి హన్మంతరావు రిటైర్డ్ ఇంజనీర్, గౌతమి నగర్, మంచిర్యాల అనే వ్యక్తి కి KYC అప్డేట్ కోసం సైబర్ నేరగాడు ఒక మెసేజ్ పంపగా దాన్ని నమ్మి అకౌంట్ వివరాలు అందచేశారు. వెంటనే ఆయన బ్యాంక్ ఖాతా నుండి 3,10,000/ డెబిట్ అయిపోయాయి. తాను మోసపోయానని భావించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.
సైబర్ క్రైమ్ వారి ఆదేశాల మేరకు తక్షణమే స్పందించిన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రామగుండం సైబర్ సెల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్పందించి సంబంధిత ఫ్లిప్ కార్ట్ నోడల్ ఆఫీసర్ కి లెటర్ పంపించి డబ్బులను నేరస్తుని ఖాతాలో నిలిపివేయించారు. ఆ మొత్తాన్ని మూడురోజుల్లో తిరిగి ఇప్పించారు. బాధితునికి న్యాయం చేయడం లో చురుకుగా వ్యవహరించిన మంచిర్యాల పట్టణ ఇన్ స్పెక్టర్ నారాయణ, సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ కోటేష్ లను మంచిర్యాల ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అభినందించారు.
ఈ సందర్బంగా మంచిర్యాల ఇన్‌ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి లేదా https://cybercrime.gov.in వెబ్ సైట్ నందు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్, మెసేజెస్ నమ్మి బ్యాంక్ ఖాతా వివరాలను, OTP, KYC, అనుమానస్పద లింక్స్, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలను ఎవ్వరితో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.
Read Also: Bjp Loss Credibility: బెంగాల్ ప్రజల విశ్వాసం కోల్పోతున్న బీజేపీ