Telangana Rains: నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి గాలుల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాకముందే వరుణుడి రాక మొదలైంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, ఉప్పల్, రామాంతపూర్, బోడుపాల్, మేడిపల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, చింతల్, సూరారం, బోయినగర్, బోయిన్‌పల్లి డ్రైనేజీలు పలుచోట్ల పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Read More: TG Polycet Results: నేడు పాలిసెట్ ఫలితాల విడుదల..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమికి అల్లాడిపోయిన జనం చల్లటి వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేసముద్రంలో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భూపాలపల్లి నియోజకవర్గమంతా తుపాను బీభత్సానికి జనం ఉలిక్కిపడ్డారు. రోజంతా ఎండతో అల్లాడుతున్న ములుగు జిల్లా వాసులు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఏటూరునాగారం, గోవిందరావుపేట, ములుగు, వాజేడు మండలాల్లో గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
Read More: Sabari : ఓటీటీలోకి వచ్చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ శబరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం గూడూరు దర్గా వద్ద మర్రి చెట్టు కొమ్మ కూలి కారు ధ్వంసమైంది. చండీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ టవర్ కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షానికి గుండి నది వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
Read More: Mother Kills Children: నలుగురు పిల్లలను ట్యాంక్‌లో పడేసి చంపిన తల్లి.. ఆపై!
పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మంథని మండలం ఉప్పతాల్‌లో పిడుగుపాటుకు తాటిచెట్టు ఢీకొని ఇంటి ముందున్న రేకుల షెడ్డు ధ్వంసమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యాదగిరిగుట్టలో వాతావరణం చల్లబడడంతో భక్తులు ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాలు కర్నూలు జిల్లా వరకు విస్తరించి ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?