కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేపట్టిన నిరసనకాండ తీవ్ర ఉద్రికత్తలకు దారితీసింది. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లడమే కాకుండా.. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. అంతేకాకుండా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు వెల్లడిస్తూ.. ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి 300 మంది ఆందోళనకారులు సాధారణ ప్రయాణికులలా గేట్ నెం 3 నుండి వచ్చినట్లు తెలిపారు. అయితే స్టేషన్ లోకి ఎంటర్ కాగానే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతలోనే.. సడెన్‌గా కర్రలు, రాడ్లతో సుమారు 2000 మంది ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించి.. ట్రైన్స్ పై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఆందోళనకారులను నివారించేందుకు బందోబస్తులో ఉన్న పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులపైకి రైల్వే ట్రాక్ పై ఉన్న రాళ్లతో నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. మొత్తం 8 ట్రైన్‌లపై ఆందోళనకారులు దాడులకు తెగబడినట్లు వారు వెల్లడించారు. అయితే.. పోలీస్ ఫోర్స్ పెరిగ్గానే ఆందోళన కారులు ట్రాక్‌పైకి పరుగులు తీసి, పోలీసులపై రాళ్ల వర్షం కురిపించడంతో 7 గురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్లాట్ ఫామ్ 1 వద్ద కాజీపేట ఎండ్‌లో లోకో ఇంజిన్‌లో 3000 లీటర్ల ఆయిల్ ఉంది. దానిపై దాడి చేసి తగలబెట్టెందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. లోకో ఇంజిన్ ను తగలబెట్టి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేది.
ఆందోళనకారులను వాటిపై దాడి చేయవద్దని పదే పదే చెప్పిన వినలేదు.. దీంతో ఆందోళనకారులను నివారించే ప్రయత్నం చేసినా పోలీసులపై రాళ్లు రువ్వుతూనే లోకో ఇంజిన్ వైపు వెళ్లారు. ఈ క్రమంలోనే పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. మేము చేసిన కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు హాస్పిటల్‌లో మృతి చెందాడు. మరో 12 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్‌లో 20 కోట్లు అస్తి నష్టం జరిగింది. బీహార్, హర్యానాలో అల్లర్లు చూసే ఇక్కడ వాట్సప్ గ్రూప్స్ లో చర్చ పెట్టుకుని స్టేషన్ కు వచ్చి విధ్వంసం చేశారు అని రైల్వే పోలీసులు ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు.