రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బకాయిలు విడుదల చేయకపోవడంతో నవంబర్ 3 నుంచి అన్ని వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి 1,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. “మిగతా మొత్తానికి ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ఒక రోడ్‌మ్యాప్ రూపొందించాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎంతో సహా అందరినీ కలిసాం, కానీ కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన 900 కోట్లు దీపావళి వరకు ఇవ్వాలని అడిగినా స్పందన లేదు. నవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు ఇవ్వాలని మేము కోరాం” అని వివరించారు.
అంతేకాకుండా.. “మా మీద ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. విజిలెన్స్ విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా కాలేజీలు నవంబర్ 3 నుండి నిరవధిక బంద్ చేస్తున్నాం. ప్రభుత్వం రేపటిలోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో బంద్ తప్పద” అని హెచ్చరించారు. అలాగే బంద్ సమయంలో జరగనున్న పరీక్షలను కూడా వాయిదా వేయాలని కోరారు. “కళాశాలలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పాలి. నవంబర్ 6న లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. నవంబర్ 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం” అని తెలిపారు.
“ఆ కాలేజీలకు లంచం ఇచ్చారా? అనే అంశంపై విచారణ జరపాలి. ఫ్రాడ్ జరిగిన చోటే విచారణ జరగాలి. అవసరమైతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్లను ముట్టడిస్తాం. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణలు” అని చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “సర్కార్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకోవడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోంది. విజిలెన్స్ విచారణ పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో మా బకాయిలు విడుదల చేయాలి. విద్యార్థి సంఘాలు కూడా మా వెంట ఉద్యమిస్తున్నాయి. విజిలెన్స్ తో బెదిరిస్తే భయపడేది లేదు” అని స్పష్టం చేశారు.
Supreme Court: అది ప్రేమ, కామం కాదు.. “పోక్సో కేసు”లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..